సిగ్మాతెలుగు డాట్, న్యూస్: రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ సంచలన ఉత్తర్వులు విడుదల చేయడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని విపక్ష పార్టీల నుండి భారీ సంఘీభావం లభించింది, రాహుల్ గాంధీ నేడు, శనివారం మధ్యాహ్నం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దేశం నాకు అన్నీ ఇచ్చింది. దేశం కోసం పోరాడతా’‘ అని అన్నారు. మోడీ సర్కార్ తనను చూసి భయపడుతోందని ఈ చర్యతో అందరికి అర్ధం అయ్యిందని.. తనను శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా, తన పని తాను చేసుకుంటూనే పోతానని, పార్లమెంటులో ఉన్నానా ? లేనా? అనేది ప్రశ్న కాదని చెప్పారు. దేశం కోసం తాను పోరాటం సాగిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ కి ప్రధాని మోడీకి ఉన్న దోస్తీ గుజరాత్ లో మోడీ సీఎంగా ఉన్నప్పటి నుండి ఉందని, అదానీ గ్రూపు లో చైనా వారి పెట్టుబడులు కూడా ఉన్నాయని, మోడీ, అదానీ బంధం… అవినీతి ఫై తాను సాక్ష్యాలను గతంలోనే వెల్లడించానని ఇప్పడు లోక్ సభలో అదానీపై తన తదుపరి ప్రసంగం ఎలా ఉంటుందోనని ప్రధామంత్రికి భయం పట్టుకుందని, ఆ భయం ఆయన కళ్లలో తాను చూశానని రాహుల్ గాంధీ అన్నారు. అందువల్లే తొలుత తనపై వక్రీకరణలు చేశారనీ , ఇప్పుడు అనర్హత వేటు వేశారని ఆరోపించారు. నిజం మాట్లాడటం మినహా తనకు వేరేవాటిపై ఆసక్తి లేదని, తనను అరెస్టు చేసినా, జైలులో పెట్టిన నిజం కోసం , దేశం కోసమే తాను పనిచేస్తానని అన్నారు. మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలి..అదానీ వంటి వ్యక్తులు ప్రధానితో తమకున్న సంబంధాలతో దేశాన్ని ఎలా వంచిస్తున్నారో ప్రజల ముందుకు వెళ్లి వివరిస్తానని ప్రకటించారు,
