సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లో ఎన్నో భారీ విజయాలు సాధించిన జెంటిల్మన్,ఒకే ఒక్కడు.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) గతంలో యాక్షన్ సినిమాలతో దర్శకుడుగా కూడా నిరూపించుకొన్నారు. తాజగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘సీతా పయనం’ (Seetha Payanam). ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా, ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్ హీరోగా పరిచయం అయ్యారు. నేడు, శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతా పయనం’. కధ విషయానికి వస్తే ..సీత (ఐశ్వర్య అర్జున్ Aishwarya Arjun) తల్లి లేని పిల్ల. మల్టీమిలియనీర్ రాజేంద ప్రసాద్ (సత్యరాజ్ ) గారాల కూతురు. వంటలలో షెఫ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీత ఒకసారి వైజాగ్ నుండి హైదరాబాద్‌కు కారులో జర్నీ చేస్తుంది. కారు బ్రేక్ డౌన్ అయిన అభి (నిరంజన్) అనే కుర్రాడు హైదరాబాద్ వరకూ లిఫ్ట్ ఇచ్చి ఆ దారిలో ఒకరి గురించి ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సీతాపురం వెళ్ళే దారిలో అభిని దించి, సీత హైదరాబాద్ చేరుతుంది. సీత హాజరు కావాల్సిన వర్క్ షాప్ జరిగే హోటల్ఆమె లోపలకు అడుగు పెట్టడానికి కొన్ని సెకన్ల ముందు భారీ అగ్ని ప్రమాదానికి గురవుతుంది. అందులోని వారంతా చనిపోతారు. మరల వైజాగ్ కు తిరుగు ప్రయాణం సీత జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? అనేది మిగతా కథ. ఇక సినిమా అంతా అర్జున్ దర్శక ప్రతిభ ప్రతి సన్నివేశంలో కనపడుతుంది. కుటుంబ విలువలు, అనుబంధాలు తో సరికొత్త కధనంతో అర్జున్ దర్శకత్వప్రతిభ సినిమాలోని ప్రతి సన్నివేశంలో కనిపిస్తూనే ఉంది. ఈ జర్నీలోనే సీత, అభి ప్రేమాయణాన్ని హృద్యంగా తెర మీద చూపించారు. ఈ సినిమాలో అన్ని పాత్రలు మంచివే. అర్జున్ గెస్ట్ గా పోషించిన గిరి అనే రౌడీ పాత్రను కూడా పాజిటివ్‌గా మార్చేశారు. ప్రథమార్ధం సరదాగా సాగిపోయినా, ద్వితీయార్ధంకు వచ్చేసరికీ కాస్త నిడివీ ఎక్కువ అనే భావన కలుగుతుంది. కొత్తవాడైనా నిరంజన్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. హీరో తాతయ్యగా ప్రకాశ్ రాజ్ తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. సత్యరాజ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా ఇందులో ఓ కీలక సన్నివేశంలో నటించాడు. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతంతో పాటు మూడు పాటల స్వరాలు చక్కగా ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్‌గా నిలిచింది. బుర్రా సాయిమాధవ్ మాటలు బాగున్నాయి.
