సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో వేలాది కార్మికులు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లు చాల కాలం తరువాత నేడు, మంగళవారం తిరిగి తెరుచుకొంది. సుమారు ఏడాదిక్రితం యాజమాన్యంతో నూతన వేతన ఒప్పందం చేయాలని ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లు కార్మికులు చేపట్టిన సమ్మెతో విభేదించిన మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీనితో 11 యూనియన్లుగా మిల్లు కార్మికులు గత కొద్ది నెలలుగా నిరసనలు చేపట్టిన సంగతి విధితమే. రెండు దపాలుగా యాజమాన్య ప్రతినిధులు, కార్మిక యూనియన్లతో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ప్రశాంతి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల డిమాండ్‌ను యాజమాన్యం అంగీకరించలేదు. మిల్లు రూ.1200 కోట్ల లాభాల్లో ఉండగా కార్మికుల వేతనాలు పెంచడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత సోమవారం రాత్రి పరిశ్రమల శాఖ అధికారులను తీసుకుని కార్మిక సంఘాలు, మిల్లు యాజమాన్య ప్రతినిధులతో సుమారు గంటపాటు చర్చించారు. దీంతో 9 యూనియన్లు సమ్మెను విరమించేందుకు అంగీకారం తెలిపాయి. వెంటనే మిల్లు యాజమాన్యం కూడా లాకౌట్‌ను ఎత్తివేసేందుకు అంగీకరించింది అయితే మిగిలిన ఆ రెండు యూనియన్ల వైఖరి ఫై నేడు, మంగళవారం చర్చలు జరుగుతున్నాయి.
