సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో నేడు, బుధవారం మధ్యాహ్నం ఆయన వాహనంపై రాళ్లు దాడి జరిగింది. హరిశ్చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాంగంజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కొందరు ఆగంతుకులు వాహనంపై రాళ్లు రువ్వడంతో వాహనం వెనుక అద్దం పగిలిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ చౌదరి తెలిపారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించినప్పటి నుంచి ఇండియా కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్ మధ్య పరిస్థితి గంభీరంగా మారింది. ఈ పరిస్థితిలోనే రాహుల్ వాహనంపై రాళ్ల దాడి జరగడం గమనార్హం. గత జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మార్చి 20న ముంబయిలో ముగియనున్నది.
