సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న అంటే రేపటి గురువారంఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు (రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి )జరిగే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ‘ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలకు, గుంటూరు-కృష్ణా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఏకంగా 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 38 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పొలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు అధికారులు పటిష్ట బందోబస్తు నడుమ తరలిస్తున్నారు.
