సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ను బలంగా నిలబెట్టే వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుంచి సెప్టెంబరు)లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని ప్రకటించింది. దీర్ఘకాలిక సగటులో 106 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నాలుగు నెలల నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, అయితే రైస్ బెల్ట్‌గా పిలిచే గంగా మైదానంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని ఐఎండీ నివేదిక స్పష్టం చేసింది. ఎల్‌నినో ప్రభావంతో గతేడాది నైరుతి సీజన్‌లో 868.6 మిల్లీమీటర్లకుగాను 820 మి.మీ. వర్షపాతం నమోదుతో అనేక ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గింది. జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అయితే ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
