సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి ఇల్లు నిర్మాణం పూర్తి చేయకపోతే స్థలాలు స్వాధీనం చేసుకుంటామని గృహ నిర్మాణ శాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్దిదారులను బెదిరించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తున్నట్టుగానే సిపిఎం భావిస్తోందన్నారు. పేదలకు ఇళ్ల నిర్మించుకోవడం కోసం స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. కానీ ఇల్లు నిర్మాణ వ్యయం దాదాపు 5 నుంచి 6లక్షల వరకు అవుతోందన్నారు. కానీ ప్రభుత్వం లక్షా ఎనభై వేలు నుంచి రెండు లక్షల పదివేలు వరకు మాత్రమే చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నగదుతో ఇళ్ల నిర్మాణం ఎంతమాత్రం పూర్తి కాదన్నారు. ఒకవైపున పేదల ప్రభుత్వం, అందరికీ ఇల్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం కేవలం సెంటు భూమిని ఇచ్చి, స్థలాలు పూడ్చకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారుల ముఖాన కొట్టిందన్నారు. రోజు రోజుకి అన్ని ధరలు పెరిగిపోతున్నాయి.ఇళ్ల నిర్మాణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా, నెపాన్ని ప్రజలపై నెట్టి స్థలాలు లాక్కుంటాం అని బెదిరించడం ఆపకపోతే ఇక ఉద్యమిస్తామని ప్రకటించారు.
