సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత బుధవారం మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు 12 గంటల సుదీర్ఘ చర్చ తరువాత వక్ఫ్ సవరణ బిల్లు-2024ను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లు పేరును ‘యూఎంఈఈడీ-ఉమీద్ గా మార్చినట్లు ప్రకటించారు. జేపీసీ సిఫారసులతో పాటు ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని అన్నారు, ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని విమర్శలు గుప్పించారు. లోక్ సభలో మూజువాణీ ఓటుతో ‘ఉమీద్’ను ఆమోదించేందుకు స్పీకర్ ఓం ప్రకాష్ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్ జరిపారు. అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి.పక్ష సభ్యులు తాము ప్రతిపాదించిన ప్రతి సవరణపైనా ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. అన్ని సవరణలపై ఓటింగ్ జరపడంతో ఆమోదం లభించేసరికి అర్ధరాత్రి దాటింది. బిల్లుపై చర్చ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదని, కేవలం ఆస్తుల విషయాలకు సంబంధించినదేనని స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా ముస్లిం వర్గాలకు చెందిన ఏ భూమినీ తాము లాగేసుకోబోమని స్పష్టం చేశారు.వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును ముస్లింలపై దాడిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ముస్లింల స్వేచ్ఛపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. నేడు, గురువారం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ను 8 గంటల చర్చ తరువాత సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నారు.
