సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం దేశంలో నెలకొంటున్న మత వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో గత మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది. సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు సోమవారం లోహటియాలోని బడా గణేష్ ఆలయంలో సమావేశమయ్యారు. అనంతరం వారంతా సాయిబాబా విగ్రహాన్ని ఆలయంలో నుంచి తీసేసి ప్రాంగణం బయట పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయా ఆలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందువులు సాయిబాబాను ఆరాధించడం మానుకోవాలని .. వాస్తవానికి శాస్త్రాల్లో బాబా దేవుడి ఆరాధన గురించి ఎక్కడా చెప్పలేదని సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు అంటున్నారు. అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు రాజుదాస్ సైతం ఈ చర్యను సమర్థించారు.కాశీలో పరమేశ్వరుడి ఆరాధన మాత్రమే జరగాలని దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాయి బాబాను భగవంతుని అవతారంగా అన్ని మతాలవారు పూజిస్తారని శిర్డీ శ్రీ సాయిబాబా సనాతన్ ట్రస్టు వెబ్‌సైట్‌లో తాజగా పేర్కొనడం గమనార్హం.
