సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఒక ప్రక్క రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్ దిష్టి బొమ్మలు తగలబెడుతూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. తాజగా.. వలంటీర్ వ్యవస్థను కోర్టులో చాలెంజ్ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. వాలంటీర్లు లేకపోతే దేశం ఆగిపోయిందా..? రాష్ట్రంలో పంపిణీ కార్యక్రమం ఆగిపోయిందా ?అని ప్రశ్నించారు. ఉరకలెత్తే యువతను వలంటీర్లుగా పెట్టి రూ.5 వేలిచ్చి జగన్ వారి భవిషత్తు పాడుచేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థపై తనకు కోపం లేదని.. కానీ దానిపై నియంత్రణ లేకపోవడాన్నే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. రెండో విడత వారాహి యాత్రలో భాగంగా మూడో రోజు గత మంగళవారం ఏలూరు క్రాంతి కల్యాణ మండపంలో పార్టీ దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తాను ఎక్కడ జనవాణి నిర్వహిస్తున్నా వలంటీర్లపైన ఫిర్యాదులు వినిపిస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఇంటి ఆడపిల్లలను వేధిస్తున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చారని అడగలేకపోతున్నామని చెబుతుంటారని తెలిపారు. ప్రభుత్వ అధికారుల్ని అయితే ప్రశ్నించవచ్చు.. మరి వలంటీర్లు తప్పు చేస్తే ఎవరిని వెళ్లి అడగాలి’ అని ప్రశ్నించారు. వాళ్లు 5 లక్షలున్నారు సార్.. వలంటీర్ల గురించి అలా మాట్లాడారు.. ఏమైనా అవుద్దేమోనని మా వాళ్లు భయపడ్డారు.వారికీ నేను ఒక్కటే చెప్పా.. నా సైన్యం ఎంతో తెలుసా..? చిటికెన వేలు కదిపితే ఎంత మంది కదులుతారో తెలుసా? ముందు మనకు ధైర్యం ఉండాలి. అప్పుడే జ్ఞానంతో నిర్భయంగా మాట్లాడగలం. వలంటీర్ల వ్యవస్థ ఇస్తున్న డేటా ఎక్కడ పెడుతున్నారు? జగన్ ఇంట్లో ఉందా? ఇంకెక్కడైనా పెడుతున్నారా అనే పూర్తి వివరాలు మా అందరికీ కావాలి అని పవన్ మండిపడ్డారు.
