సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సుమారు తొమ్మిది రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కోనాల్సి వుంటుంది. రోజుకు సుమారు 300 రైళ్లు రాకపోకలు సాగించే విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో వందలాది రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 50 రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నారు. సుమారు తొమ్మిది రోజులపాటు 118 రైళ్లను (రానుపోను) రద్దు, పాక్షిక రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఎం.యల్వేందర్‌యాదవ్ తెలిపారు. కాగా కొన్ని ఒరిజినేటింగ్ రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు పేర్కొన్నారు. కాగా విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు…విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన ఏ ఒక్క రైళ్లు సిగ్నలింగ్ పనులు పూర్తయ్యేంత వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవని స్పష్టం చేశారు. ప్రయాణికులు గుర్తించి రెల్వే చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు.
