సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆఫ్రికా,యూరప్ దేశాల నుండి భారత్ లో ప్రవేశించిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా మాస్క్ లు ధరించి జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరోదఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. కోవిడ్ నియంత్రణపై అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తుందని, ఇప్పటికే 32 దఫాలు ఇంటింటి సర్వే చేసి డేటా సేకరించారు. కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.36 శాతం కాగా రాష్ట్రంలో 99.21 శాతం ఉంది. మరణాల రేటు దేశంలో 1.37 శాతం అయితే ఆంధ్ర ప్రదేశ్ లో 0.7 శాతం మాత్రమే ఉండటం మన యంత్రాంగ సమర్ధత ను తెలియజేస్తుందన్నారు.
