సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత ఆ ఘనత పూర్తిగా కేంద్రంలోని బీజేపీ కి ప్రధాని మోడీ సర్కార్ కు చెందాలి అన్న బలమైన కాంక్షతో ప్రజల లో మంచి మైలేజ్ కోసం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నేతృత్వంలో విశాఖ కమలం నేతలు పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా నేడు, గురువారం తొలిసారిగా కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమార స్వామి , కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టులో వీరికి కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖపట్నం ఎంపీ. భరత్ , విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రులకు కూటమి మహిళ నేతలు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.అనంతరం అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలో కూడా కేంద్రమంత్రులకు బీజేపీ పార్టీ నేతలు భారీ క్రేన్లతో గజమాలలు వేసి స్వాగతం తెలిపారు. నేటి మధ్యాహ్నం స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోనున్న కేంద్రమంత్రులు అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ప్రైవేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు కార్మిక సంఘాలు కోరుతున్నారు..
