సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు, డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నేపథ్యంలో నేడు, సోమవారం భీమవరంలోని జిల్లా బిజెపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ .. నాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీయే నేడు భారతీయ జనతా పార్టీగా అవతరించిందని, ఆయన ప్రాణత్యాగం వలనే కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉందన్నారు. కాశ్మీర్ విషయంలో నాటి ప్రధాని నెహ్రూ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 370 రద్దు చేయాలని, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండటాన్ని నిరసిస్తూ ఆయన గళమెత్తారని గుర్తుచేశారు. కాశ్మీర్‌కు వెళ్ళిన శ్యామా ప్రసాద్ ముఖర్జీని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులోనే అక్రమంగా అరెస్టు చేయగా, అనుమానా స్పదంగా మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం నెరవేర్చిందని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. తదుపరి రాయలంలోని గ్రామంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహం వద్ద ఘన నివాళ్లు అర్పించారు. కేంద్రమంత్రి వర్మ ఈ కార్యక్రమంలో భీమవరం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కాగిత సురేంద్ర, మాజీ సర్పంచ్ రామచంద్రరావు (అబ్బులు), పత్తి హరి ఆలమూరు, మల్లికార్జున మురళీకృష్ణ, ఒబిలిశెట్టి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
