సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షికోత్సవాలు ముగింపుగా నేడు, శుక్రవారం ఉదయం 7న్నర సమయానికి శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారికి ఎదురుగ హాలులో పంచభక్ష పరమణాలతో మిఠాయిలతో మహా నివేదన ను వేదమంత్రోచ్చారణ హారతుల మధ్య స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమర్పించారు. తదుపరి..జిల్లాలో మరెక్కడా జరుగని స్థాయిలో.. ఆలయ ఆవరణలో ఏర్పటు చేసిన భారీ చలువ పందిళ్ళలో వేలాది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభమయింది. ఈ మహా నివేదన కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ వర్తకసంఘం , మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు , ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ పాల్గొన్నారు. నేటి మహా ప్రసాద కార్యక్రమం కోసం ఉత్సవకమిటీ సభ్యులు, మహిళా భక్తుల సహకారంతో గత రాత్రి నుండి ఆలయ ఆవరణలో భారీ పొయ్యాలు ,భారీ గిన్నెలు ఏర్పాటు , వంటల తయారీ, పులిహోర సిద్ధం చెయ్యడం భారీ ఎత్తున కొండ గుట్టలుగా పోసిన కూరగాయలు తరగటం వంటి ఏర్పాట్లు తో సందడి వాతావరణం నెలకొంది. నేటి శుక్రవారం సాయంత్రం వరకు లక్ష మంది భక్తులకు అన్నసమారాధన కొనసాగించనున్నారు.
