సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి పవిత్ర షిర్ది సాయి ఆలయాన్ని తిరిగి తెరిచాక, ఇటీవల వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్‌కు కానుకలు రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్ పదాధికారులు మొన్న బుధవారం వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్లైన్లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.
