సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఈసారి వచ్చే జనవరిలో సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలో ప్రయాణికులు సొంత ఊరుకు వెళ్లే ప్రయాణికులు వాహనాల కోసం గతంలో కన్నా ఎక్కువ ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఫిబ్రవరి వరకు వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు దాటింది. జనవరి, ఫిబ్రవరి నెలల కోసం అన్ని రైళ్లలో బెర్తులు ఇప్పటికే భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. మరో ప్రక్కన కోవిద్ కారణంగా 2 ఏళ్లుగా భక్తులకు దర్శనాలకు ఉన్న ఇబ్బందులు తొలగించడంతో ఈ విడుత శబరిమల అయ్యప్ప సన్నిధికి చేరేందుకు భక్తజన సందోహం పడిగాపులు కాస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలోనే భక్తులు మాలధారణ గావించారు. డిమాండ్‌కు తగిన రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒకటే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్‌లో ఇప్పటికే ‘నో రూం’ దర్శనమిస్తోంది. సంక్రాంతి పర్వదినాలు కు విజయవాడ, నరసాపురం,విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తే తప్ప ఊరెళ్లడం సాధ్యం కాదు. మరోవైపు జనవరి మొదటి వారానికే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటిపోయింది. ఆర్టీసీ స్పెషల్ బస్ లతో పాటు ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోత ఎలాగూ మ్రోగనుంది.
