సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఉదయం 11.30 గంటలకు నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని, ఎంపీ బండి సంజయ్ పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పరిశీలించి మొదటి కోచ్‌లోని చిన్నారులతో, డ్రైవింగ్ క్యాబ్‌లోని సిబ్బందితో మోదీ మాట్లాడారు.ఇక్కడ్నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం రోడ్డు రవాణా శాఖ ప్రాజెక్టులకు, బీబీనగర్‌లోని ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి (వర్చువల్‌గా), సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య పూర్తి చేసిన డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఢిల్లీ వెళతారు. అయితే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆయన బదులు ఎప్పట్లాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. గత ఏడాది ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లోని చిన జీయరు స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరయ్యారు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో అప్పట్లో మోదీకి స్వాగతం, వీడ్కోలు చెప్పడానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఆ తర్వాత, ఐఎస్‌బీలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరైనా కేసీఆర్ వెళ్లలేదు. ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని వచ్చినా సీఎం కెసిఆర్ రాకపోవడం గమనార్హం..
