సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సుగంధ ద్రవ్యాలు అంటే ముందుగా గుర్తొచ్చేది కేరళ రాష్ట్రము. ఐతే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇటీవల విదేశాలకు సుగంధ ద్రవ్యాల,మసాలా ఉత్పత్తులు ఎగుమతులు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలం నాటికి రాష్ట్రం నుంచి 15.16 కోట్ల కిలోల సుగంధ ద్రవ్యాలు రికార్డు స్థాయిలో ఎగుమతి అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) తాజాగా విడుదల చేసిన నివేదిక లో పేర్కొన్నారు. సుమారు 80కిపైగా దేశాలకు రూ.2,462.95 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలను మనం రాష్ట్రం ఎగుమతి చేసింది. రాష్ట్రంలో సాగవుతున్న మిర్చి, పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతోపాటు కాఫీ, జీడిపప్పు వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.విశాఖ మన్యంలో పండించే అరకు కాఫీకి ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో రాష్ట్రం నుంచి 1.49 కోట్ల కిలోల కాఫీ ఎగుమతి అయ్యింది. సుమారు 71 దేశాలకు మన రాష్ట్రం నుంచి ఏడు నెలల్లో రూ.659.62 కోట్ల విలువైన కాఫీ ఎగుమతులు జరిగాయి
