సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు, సినీ హీరో, నిర్మాత ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గత శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే (రాత్రి 10గం. ప్రాంతంలో) రమేశ్‌బాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు 1965, అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించారు రమేశ్‌బాబు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తొలిసారి నటించారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్ రోల్లో నటించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’లో తొలిసారిగా టీనేజ్ ప్రధాన పాత్ర చేశారు. రమేశ్ సోదరుడు మహేశ్‌బాబుకు బాలనటుడిగా ఇదే తొలి చిత్రం. దాసరి ‘పాలు నీళ్లు’లోనూ రమేశ్ ప్రధాన పాత్రలో కనిపించారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’ 70 ఎం ఎం సినిమాతో (1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు. వాటిలో, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, అన్నాచెల్లెలు, ఎన్కౌంటర్ సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 1997లో ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఎన్కౌంటర్’రమేశ్‌బాబుకి చివరి చిత్రం. ఆ తర్వాత సినిమాలు లో నటించడం మానివేసి , సినీ నిర్మాతగా మారారు. 1999లో వచ్చిన హిందీ చిత్రం ‘సూర్యవంశమ్’(తెలుగు ‘సూర్యవంశం’చిత్రానికి రీమేక్) చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశారు. తర్వాత తండ్రి పేరుతో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థను ప్రారంభించి, సోదరుడు మహేశ్‌బాబు హీరోగా ‘అర్జున్’ ‘అతిథి’సినిమాను నిర్మించారు. మహేశ్ ‘దూకుడు’, ‘ఆగడు’చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. రమేశ్‌కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. రమేశ్ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
