సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దని, ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్దడం దారుణమని, మీటర్ రీడర్స్ కి సంస్ధలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేస్తూ ఎఐటియుసి విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు, సోమవారం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన చేపట్టి, కలెక్టరేట్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రంను మీకోసం లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇది ప్రజా ప్రయోజనాలకు అరిష్టమని, గతంలో స్మార్ట్ మీటర్లను నేలకేసి కొట్టి న నారా లోకేష్ ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట తప్పుతున్నారని, ప్రశ్నించారు. యూనియన్ భీమవరం డివిజన్ అధ్యక్షులు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని స్మార్ట్ మీటర్లు పేరుతో 4,500 కుటుంబాలను రోడ్డున పడేయొద్దని తమకు న్యాయం చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధనకు దశల వారీగా పోరాటం చేస్తామని ఈ నెల 27న సిఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామని జాకబ్ హెచ్చరించారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా స్మార్ట్ మీటర్లు బిగించి వారిని బయటకు పొమ్మంటే కుదరదని వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు.
