సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ తాజగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. నిన్న శుక్రవారం (ఈ నెల 19న) ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరిన అవినాశ్‌రెడ్డికి మార్గమధ్యంలోనే ఆయన వాట్సాప్‌కు సీబీఐ నోటీస్‌లు అందాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. కానీ… మధ్యలోనే రూటు మారింది.ఆయన కాన్వాయ్ జాతీయ రహదారివైపు మళ్లింది. ఆయన లాయర్లు మాత్రమే సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అవినాశ్ రెడ్డి విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు వివరించారు. ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని, అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నారని లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. ఊహించని పరిణామంతో సీబీఐ అధికారులు విస్తుపోయారు. ఈలోగా ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ చెయ్యడం కోసం సిబిఐ అధికారులు ఆయన కారును వెంటాడుతున్నారని, సినిమా ట్విస్టుల తరహాలో కారు ఛేజింగ్ సీన్స్ చూపిస్తూ కొన్ని మీడియా చేనెల్స్ లో తీవ్ర ప్రచారం జరిగింది. తీరా చుస్తే సిబిఐ ఈ నెల 22న మరోసారి విచారణకు పిలవడం గమనార్హం.
