సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ సమీపంలోని గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో 30 ఎకరాల్లో నేడు, ఆదివారం మధ్యాహ్నం నుండి నిర్వహిస్తున్న హైందవ శంఖారావం (Hindu Sankharavam) బహిరంగ సభకు హిందూ బంధువులు పోటెత్తారు. విశ్వ హిందూ పరిషత్తు ,బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు విజయవాడ నుంచి గన్నవరం నాలుగు వైపుల ట్రాఫిక్ మళ్లించారు. ఈ శంఖారావం సభ నిర్వాహకులు ‘భీమవరం’ కు చెందిన మాజీ బీజేపీ ఎంపీ. పారిశ్రామిక వేత్త గోకరాజు గంగరాజు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారతీయ సంస్కృతి, జానపద కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదంతో సభా ప్రాంగణం, రోడ్లు, మారు మోగుతున్నాయి. హిందూ జాతీయ ఉద్యమానికి మూడు లక్షల మందితో తొలి సభకు ఆదివారం అంకురార్పణ చేశారు. హిందూ ఆలయాల పరిరక్షణ, ధర్మ కర్తల మండలి సభ్యుల ఎంపికలో స్థానిక ప్రభుత్వాల ప్రమేయం లేకుండా దేవాలయ నిర్వాహకులకే ( ఈ ఉద్యమం సఫలమైతే, ఇకపై అన్ని రాష్ట్రాలలో భక్తులు హిందూ దేవుళ్లపై భక్తితో సమర్పించే హుండీ ఆదాయాలు ప్రభుత్వానికి చెందవు ) స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ ఉద్యమం చేపట్టారు. దేశ వ్యాప్త పోరాటానికి విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో హైందవ శంఖారావం సభలు నిర్వహించనున్నారు.
