సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: హైదరాబాద్ లో 1200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అపూర్వముగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ నేడు, ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. సచివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు, యాగం చేశారు. వాస్తు పూజ చేశారు. అనంతరం కొత్త కార్యాలయంలో కేసీఆర్ కార్యకలాపాలు ప్రారంభించారు. రాష్ట్రంలో పోడు పట్టాల మార్గదర్శకాలపై ఆయన తొలి సంతకం చేశారు. అయితే తెలంగాణ ప్రధమ పౌరురాలు గవర్నర్ తమిళసై హాజరు కాకపోవడం గమనార్హం. ( ఆహ్వానం పంపలేదా?) ఈ సందర్భముగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి మార్గదర్శకం. తెలంగాణ తలెత్తుకునేలా సచివాలయ నిర్మాణం. సచివాలయం నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. గాంధీ మార్గంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని, తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా? అని హేళన చేశారని, విమర్శలు పట్టించుకోకుండా కృషి చేయడమే తమ విధానమని కేసీఆర్ స్పష్టం చేశారు.
