సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు, ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం తొలి ప్రసంగం చేశారు. ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ కొన్ని సమయాలు వస్తూ ఉంటాయని, అవి అమరత్వం పొంది శాశ్వతంగా నిలిచిపోతాయని, అటువంటి రోజే మే 28 అని తెలిపారు. భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా భారతీయులందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ఈ అమృత మహోత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంటు భవనాన్ని బహూకరించుకున్నారని తెలిపారు. ఈ నూతన పార్లమెంటు కేవలం ఓ భవనం కాదన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. ప్రపంచమంతా భారత దేశంవైపు ఆసక్తిగా చూస్తోందన్నారు. కొత్త పార్లమెంటు భవనం భారత దేశ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. ప్రపంచానికి భారత దేశం దృఢ సంకల్పంతో సందేశాన్ని ఇస్తోందన్నారు. రానున్న కాలంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోదీ చెప్పారు. పాత పార్లమెంటు భవనంలో అనేక ఇబ్బందులు ఉండేవని, సభ్యులు కూర్చోవడానికే కాకుండా, సాంకేతిక సమస్యలు కూడా ఉండేవని చెప్పారు. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగినట్లుగానే నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించామని చెప్పారు.
