సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భద్రాచలానికి గోదావరి నది వరద పోటెత్తింది. నేటి గురువారం తెల్లవారు జామున రెండోప్రమాద హెచ్చరిక జారీ చేసారు. అక్కడినుంచి 10.78లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలడంతో రాజమండ్రి, ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తింది. దానితో అధికారులు 8.5లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడంతో కోనసీమలోని నదీపాయలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.ఇటు పశ్చిమ, అటు తూర్పు ఉభయగోదావరి జిల్లాల మధ్య ఉన్న సి.గన్నవరం మండలంలోని చాకలిపాలెం కాజ్వే పూర్తిగా నీట మునగడంతోపాటు దొడ్డిపట్ల రేవులో ప్రయాణికుల రాకపోకలను నిలిపివేయడంవల్ల సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. జి.పెదపూడి వద్ద నాలుగు లంకగ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు లైఫ్ జాకెట్ల సహాయంతో బోట్లపైనే ప్రయాణాలు చేస్తున్నారు. వరద పెరుగుతున్న దృష్ట్యా బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలకు అవసరమైన ఇసుక బస్తాలు, సర్వే కర్రలు వంటి ఇతర మెటీరియల్ను సిద్ధం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ప్రత్యేకాధికారులను ఆదేశించారు.అక్విడెక్టుల పటిష్టతపై తీసుకుంటున్న రక్షణ చర్యలను సమీక్షించారు. ప్రస్తుతం ఇసుక ర్యాంపు నిలిచిపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాల ద్వారా ఇసుకను తీసుకువెళ్లేందుకు వినియోగదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో రెండురోజుల్లో గోదావరి వరద మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
