సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలో ప్రధానిగా మోదీతో పాటు ఆయన క్యాబినెట్‌ మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో నేటి సాయంత్రం (జూన్ 9న) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ టీంలో 30 మందిని ప్రస్తుతం తీసుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటుదక్కింది. కాగా.. అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ను కేంద్ర మంత్రి పదవి వరించింది. భీమవరం పట్టణంలో సామాన్య కుటుంబానికి చెందిన వర్మ ఇటీవల మాజీ ఎంపీ రఘురామా ను కాదని బీజేపీ ఎంపీ టికెట్ సాధించడమే కాకుండా గతంలో ఈ సిగ్మెంట్ లో ఎవరు సాధించలేని 2.79 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ప్రస్తుత ఏపీ బీజేపీ ఎంపీలలో ఎటువంటి కల్తీ లేని నికార్సయిన బీజేపీ వాదీ గా గుర్తించిన కేంద్ర పెద్దలు వర్మ కు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం పట్ల జిల్లా వ్యాప్తంగా భీమవరం పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రముఖులు అభినందలు కురిపిస్తున్నారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణ రాజు, సీతాలక్ష్మి.. భార్య వెంకటేశ్వరీ దేవి పీజీ చదివిన శ్రీనివాసవర్మ.. ఇంగ్లిష్, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, మునిసిపల్ ప్యానల్ స్పీకర్ గా, ప్రఖ్యాత డీఎన్‌ఆర్‌ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1980ల్లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌లో పని చేశారు. తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరి 1991-1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్‌ కన్వీనర్‌గా, జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌గా వ్యవహరించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో, మీడియా వాళ్లతో సోదర ‘ అంటూ కలుపుగోలు తనం ఉంది. 2004 లో రెబల్ స్టార్ కృష్ణంరాజు , 2014 లో గోకరాజు గంగరాజు ను ఇక్కడి లోక్ సభ సీటులో గెలిపించి కేంద్రానికి పంపించడం లో కీలక పాత్ర వహించారు. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం పోటీ చేసి ఓటమి పాలయ్యారు 4 సార్లు భీమవరం వేదికగా బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు అపూర్వముగా ఏర్పాటు చేసారు. జయాపజయాలకు అతీతంగా బీజేపీ కి జిల్లా కేంద్రంగా భీమవరంలో ఒక నిర్ణయాత్మక శక్తి గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. 2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. ఇప్పుడు ‘ఎంపీగా అంతకు మించి కేంద్ర మంత్రి’గా పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని వర్మ హామీ ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *