సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం మధ్యాహ్నం నరసాపురం – చెన్నై వందే భారత్ రైలు ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అశేష జనవాహిని మధ్య లాంఛనంగా జెండా ఊపి నరసాపురం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, నరసాపురం, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ లు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ..వందే భారత్ రైలు ప్రయాణం వర్తక, వాణిజ్య వ్యాపారాలకు, తీర ప్రాంత మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కోస్తా జిల్లా మణిహారంగానిలుస్తుందని, చదువుకునే విద్యార్థులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు చెన్నై వెళ్లే వారికి తక్కువ సమయంలో కేవలం 9 గంటల సమయంలో వెళ్లేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. మత్స్య పరిశ్రమ పురోభివృద్ధి చెందాలంటే రైలు కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు.నర్సాపురం నుండి భీమవరం, గుడివాడ, విజయవాడల మీదుగా హైదరాబాద్, బెంగళూరు వెళ్లే వందే భారత్ రైలు సర్వీసులకోసం సంబంధిత కేంద్ర మంత్రితో, అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు తాడేపల్లిగూడెంలో కూడా ఆగేలా ఏర్పాటు చేస్తానన్నారు.
