సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ (రామాయణం గోవిందరావు అడ్జక్షులు ) ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో నేడు, బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రేపు గురువారం జనవరి 13 వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాలలో,దేశంలో ప్రఖ్యాతి గాంచిన భీమవరం పురాధీశ్వరి’ శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షికోత్సవాలు‘ ప్రారంభిస్తున్నామని ఉదయం 7గంటలకు తుటారపు ఏడుకొండలు దంపతులు ఆలయంలో పూజ నిర్వహిస్తారని , మధ్యాహ్నం శ్రీ అమ్మవారికి మేళ తాళాలతో నగరోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభిస్తారని, సాయంత్రం 5గంటల నుండి కళావేదికపై సాంసృతిక కార్యక్రమాలను మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నెల 10 వ తేదీ వరకు 28 రోజుల పాటు 90 లక్షల రూపాయల ఖర్చుతో నిర్వహించే ఈ వేడుకలలో ప్రతి రోజు నాటకాలు, మ్యూజికల్ నైట్స్ తో పాటు 15 సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు, ప్రవచనాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమౌతాయని ప్రకటించారు. ఈ జనవరి 26వ తేదీ న సినీనటి ఆమనీ ని సువర్ణ కంఠాభరణం తో , 29వ తేదీన సినీనటుడు జేడీ చక్రవర్తిని సువర్ణ హస్త ఆభరణంతో ఘన సన్మానం చేస్తామని, ఉత్సవాలు ముగింపుగా ఫిబ్రవరి 10 వ తేదీన ఉదయం 8 గంటల నుండి లక్ష మందికి విందుభోజనాలతో అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు , దీనికి ప్రభుత్వ అధికారులు, మీడియా సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు.ఈ సందర్భముగా వార్షికోత్సవాల పోస్టర్ ను కమిటీ సభ్యులు విడుదల చేసారు.
