సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు,జనవరి 18 ఎన్టీఆర్ 27వ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వాడవాడలా రాజకీయాలకు అతీతంగా అన్నగారి విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం లో వీరమ్మ పార్క్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం, రెస్ట్ హౌస్ రోడ్డులలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన అభిమానులు, తెలుగు దేశం పార్టీ నేతలు పుష్ప మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పథకాలకు ఆద్యుడుగా,దేశ రాజకీయాలలో సంచలనం రేపిన, ఘనుడుగా ,తెలుగువారి అభిమాన నటుడుగా , ఆరాధ్య దైవం గా ఆయన సేవలను వక్తలు గుర్తుకుతెచ్చారు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది..ఆంధ్రుల అభినవ రామునిగా, కృష్ణునిగా ఆరాధనలు అందుకున్న గొప్ప నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగువారు ఆప్యాయంగా రాజకీయాలలో అన్నగారు అని పిలుచుకున్నా, సినిమాలలో మాఎన్టీఓడు అని అభిమానం చూపినా ఆయనకే చెల్లింది. 300లకు పైగా చిత్రాలలో హీరోగా నటించి, పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనుడు ఎన్టీఆర్. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించిన ఘనుడు. తెలుగు వారి ఘనతను విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కారణజన్ముడు గా తెలుగువారు భావిస్తారు.
