సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశవ్యాప్తంగా సత్యనారాయణ స్వామి మహిమలు తెలియనివారు ఉండరు. అటువంటిది ఆయన స్వయంభువుడుగా వెలసిన తూర్పు గోదావరి జిల్లా లో అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు స్వామి ఇకపై అతిత్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు ఈ విషయాన్నిప్రకటించారు. శ్రీ సత్యనారాయణ స్వామి భక్తులయిన సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు.
