సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘రాష్ట్ర భవిష్యత్‌కు గ్యారెంటీ’ చైతన్య రథం బస్సుయాత్ర రాజోలు నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని నేడు, శనివారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చేరుకొంది. గత నెల 20వ తేదీ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజక వర్గం నిడమర్రులో ఈ యాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతోంది. గత నెల 24వ తేదీ వరకు ఏలూరు జిల్లాలో కొనసాగి, 26న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లింది. అక్కడ పర్యటన ముగించుకుని తిరిగి 14న నేడు, నరసాపురం చేరింది. ఇక్కడి నుంచి 16న ఆచంట, 17న పాలకొల్లు, 18న భీమవరం నియోజకవర్గాల మీదుగా కొనసాగి 19న తాడేపల్లిగూడెంలో యాత్ర ముగిస్తారు. ఈ యాత్రకు నరసాపురం లో స్థానిక టీడీపీ నేతలు దాదాపు 500 బైక్‌లతో పట్టణంలో ర్యాలీ తో భారీ స్వాగతం పలికారు. నేటి సాయంత్రం ఐదు గంటలకు మొగల్తూరు సెంటర్‌లో సభ నిర్వహిస్తారు. గ్రామాలు, వార్డుల వారీగా టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.
