సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం సంచలనమ్ రేపుతోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆందోళనలో భాగంగా రేపు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంపార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన కూడా మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ రేపు సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. దీనికి నిరసనగా రేపు జరగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలి’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
