సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఒక జాతీయ ఛానెల్ తో జరిగిన ఇంటర్యూ లో దేశంలో అపర రాజకీయ చాణుక్యుడుగా పేరొందిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక విషయాలు, తన అంచనాలు వెల్లడించారు.. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఐదు నెలలపాటు చర్చలు జరిపానని, కానీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు. దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని అభిప్రాయపడ్డారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే, 2024లో ఆ పార్టీని ఓడించడం సాధ్యమేనని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. 2024లో ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించేందుకు తాను సాయం చేయాలని భావించానని చెప్పారు. అయితే ఇందుకు ప్రస్తుత పార్టీలు, నాయకత్వాలు, కూటములు పనికిరావని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పార్టీలు కొన్ని సర్దుబాట్లు, కొన్ని మార్పులు చేసుకుంటే బీజేపీని ఓడించవచ్చని అన్నారు. .దాదాపు 200 సీట్లున్న బీహార్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీకి దక్కినవి కేవలం 50 సీట్లేనని గుర్తు చేశారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో పునర్‌వ్యవస్థీకరణ అవసరమని చెప్పారు
