సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫిషరీస్ కు సంబందించిన కోర్స్ లతో ఆక్వా వర్సిటీ తరగతులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని యూనివర్సిటీ ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ) ఓగిరాల సుధాకర్ ప్రకటించారు. .స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో కలసి మండలంలోని లక్ష్మణేశ్వరం, పాలకొల్లు రోడ్డులోని పాత విజేత కళాశాల భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరసాపురంలో ఏర్పాటు చేసే యూనివర్సిటీ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక ఫిషరీస్ వర్సిటీ అని, దీని నిర్మాణానికి సుమారు రూ. 500 కోట్లు ఖర్చవుతుందన్నారు. తొలి విడతగా కేంద్రం రూ. 100 కోట్లు కేటాయించిందని, త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆలోగా తరగతుల్ని తాత్కాలిక భవనంలో నిర్వహిస్తామన్నారు. ల్యాబ్, ఫర్నిచర్, సిబ్బంది నియమాకం త్వరలో చేపడతామన్నారు.
