సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అయితే ఉదయం 8గంటల వరకు వేసవి ప్రవేశించిన పొగమంచు ప్రభావం వీడడం లేదు. ఇటు పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. పగలు, రాత్రి సమయాల్లో చలిగాలులు మధ్యాహ్నం తీవ్ర ఎండ.. భిన్నవాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. రాత్రితోపాటు ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివరాత్రి వెళ్ళగానే శివ శివ అంటూ చలి వెళ్ళిపోతుందని నానుడి.. అయితే ఇప్పటికి భీమవరం పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం 8న్నర గంటల సమయానికి రహదారులు, పంటపొలాలపై పొగమంచు ప్రభావం తగ్గలేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8గంటల వరకూ పొగమంచు కురుస్తోంది. ఇక 11 గంటలకల్లా ఎండ తీవ్రత తో ఉక్కబోత మొదలు.. వాతావరణ మార్పులతో ప్రజలు అనారోగ్య బాధితులుగా ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. పొగమంచు ప్రభావం వల్ల ఉదయమే బయటకు వస్తే తుమ్ములు అధికమై జలుబు, దగ్గు వస్తోందని తరువాత ఎండ దెబ్బకు చర్మ రోగాలు బారిన పడుతున్నామని పలువురు చెబుతున్నారు.
