సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడం పట్ల ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు , నారా లోకేష్ అచ్చెన్నాయుడు , నారాయణ , అయ్యన్నపాత్రుడు రామచంద్ర యాదవ్‌పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై నేడు, శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ సంబధిత నేతలు ఈరోజు వరకు వారి కేసులకు సంబందించిన వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. . ఫాం7లో కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సిన అవసరం నామినేషన్ల నిబంధనలో ఉందని న్యాయవాదులు దమ్మాలపాటి, ఉమేష్ చంద్ర, వివి సతీష్ పేర్కొన్నారు. వివరాలు పేర్కొనకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందని కోర్టుకు లాయర్లు వివరించారు. వారి కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. అవసరమైతే నలుగురు అధికారులను నియమించి వెంటనే కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డీజీపీని అడిగి వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమై 25తో ముగుస్తాయని, అందువల్ల వెంటనే వివరాలు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 16కు వాయిదా వేసింది.
