సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అందరూ దృష్టి జూన్ 4వ తేదీనే .. ఆ రోజు జరిగే ఎన్నికల కౌంటింగ్ పైనే… ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఓట్లను భీమవరం పట్టణంలోనే లెక్కిస్తారు. స్థానిక బివి రాజు, విష్ణు కళాశాలలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం తణుకు నియోజకవర్గాల ఈవీఎం లు భద్రపరచగా , ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాలల్లో భీమవరం, ఉండి తాడేపల్లి గూడెం లకు చెందిన ఈవీఎంలు భద్రపరచడంతో అక్కడ ప్రతిష్ఠమైన మూడంచెల హై సెక్యూరిటీ భద్రత ను ఏర్పాటు చేశారు. అక్కడే ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. .అసలు ఓట్లను ఎలా లెక్కిస్తారు… రౌండ్ లను ఎలా నిర్ణయిస్తారు? అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు అవుతుంది. కానీ దీనికోసం లెక్కింపునకు 4 గంటలకు ముందు గానే అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు. సిబ్బంది కి ఉదయం 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మెుదలవుతుంది. గం. 8.30ల వరకూ ఇది కంటిన్యూ అవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభిస్తారు. నియోజవర్గానికి వచ్చి పోలయిన ఓట్లను బట్టి రౌండ్లను కేటాయిస్తారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం వరకూ పడుతుంది. 14 – 15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. రౌండ్ కు వచ్చి సుమారు 15000 ఓట్లు ఉండేలా లెక్కిస్తారు. ఒకో ఏవిఎం లలో సుమారు వెయ్యికి పైగా ఓట్లు ఉంటాయి. రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జార్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు చేయాలి. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఆర్వో రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. లక్ష ఓటర్లు ఉంటే 9 -11 రౌండ్లలో ఫలితం వస్తుంది. నరసాపురం, పాలకొల్లు ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంది. 2 లక్షల పైగా ఓట్లు పోలయిన భీమవరం ఉండి స్థానాలలో మాత్రం 17 రౌండ్ల వరకు కౌంటింగ్ ఉంటుంది కాబ్బటి ఫలితం ఆలస్యం అవుతుంది. ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఇక నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ను రిటర్నింగ్ అధికారి స్వయంగా పర్యావేక్షిస్తారు. దీనిలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ ఫలితం కూడా అన్ని ఫలితాలు కన్నా బాగా ఆలస్యం గా వచ్చే అవకాశం ఉంది.
