సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పర్యవేక్షణలో.. SRKR మరియు విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానానికి రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఉదయం 8.30 కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇవాళ అభ్యర్థుల సమక్షంలో ఆర్వో కార్యాలయాల్లోని అధికారులు స్ట్రాంగ్ రూములు తెరవనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లలోని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు తరలించనున్నారు. జిల్లా ఎస్పీ అజితా ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన 3 అంచెల పోలీస్ భద్రతా వ్యవస్థ కౌంటింగ్ హాలు ల దగ్గర పరిసరప్రాంతాలలో ఇప్పటికే కొనసాగుతుంది. ఒకవేళ రేపు కౌంటింగ్ కేంద్రాల లోపల ఎవరైనా అవాంతరాలు సృష్టించే వారిని బయటికి పంపించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. భీమవరం పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. వందలాది పోలీస్ భద్రతా బలగలాలతో భీమవరం పట్టణం ఒక నిశ్శబ్ద యుద్ధ క్షేత్రం ను తలపిస్తుంది.
