సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఇటీవల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన విషయం విదితమే. అయితే ఆయన ఎన్నికల ప్రచార రథం గత అర్ధరాత్రి మంటలలో ఆహుతి అయ్యింది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్ ఆఫీసులో ప్రచార రథం ఉంది. శుక్రవారం (నిన్న) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి మార్గాని భరత్ చేరుకున్నారు. తర్వాత ప్రకాష్ నగర్, బొమ్మూర్ పోలీసులు వచ్చారు. ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘రాజమహేంద్రవరంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి విష సంస్కృతిని నేను ఎప్పుడూ చూడలేదు. నగరంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం దారుణం. అధికార టీడీపీ పార్టీ నేతల అండదండలతో దాడులు జరుగుతున్నాయి. ప్రచార రథం దగ్ధం ఘటన గురించి డీజీపీకి చెబుతా. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతాను అని’ మార్గాని భరత్ స్పష్టం చేశారు.
