సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లిగూడెం లో తాజగా ప్రపంచ రికార్డు స్థాపనే ధ్యేయంగా అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు సంస్థ అయిన ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన “శ్రీశ్రీ కళా వేదిక” ఆధ్వర్యంలో స్థానిక బి.వి.ఆర్. కన్వెషన్ హాలులో 24 గంటల పాటు నిరంతరం అక్టోబర్ 19 వ తేదీ, 20 వ తేదీలలో నిర్వహించిన సాహిత్య, సాంస్కృతిక, కళా జాతరలో తూర్పు గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, పాలంగి గ్రామానికి చెందిన విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు, కవి, రచయిత, టీవీ మరియు సినీ క్యారక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ పాల్గొని కవితా గానం చేసారు. “భారత మాతా ! నన్ను క్షమించు !!” అనే వచన కవితను వారు ఈ వేదికపై చదివి అభినందనలు అందుకొన్నారు. మూడు వందలకు పైగా కవులు, గాయకులు, కళాకారులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు, దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇరవై నాలుగు గంటల “వరల్డ్ రికార్డు” కార్యక్రమంలో భాగస్వామి అవడం తన పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నట్లు కోట రామ ప్రసాద్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
