సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ విమానాశ్రయం నుండి విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. దీంతో నేటి నుంచి విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.”విశాఖ-విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటిసారి. ప్రజల కోరిక మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులు ప్రారంభించాం. రెండు నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు తగ్గుతాయి. విశాఖ విజయవాడ మధ్య రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉంది.”విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం. త్వరలో విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తాను. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్నాం. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని మరిన్ని కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నాం అన్నారు.
