సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల తరువాత 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఔట్‌ల అనుమతులను స్థానిక మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ క్యాబినెట్లో ఆమోద ముద్ర పడింది. అలాగే పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలిపారు. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. అలాగే జనవరి 8న వైజాగ్ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై చేపట్టవలసిన శంకుస్తాపనలపై క్యాబినెట్లో చర్చించారు.
