సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, బుధవారం ఉదయం “బేటి బచావో బేటి పడావో” (ఆడపిల్లలను రక్షించండి – ఆడపిల్లలకు చదువు చెప్పండి) కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాంబే స్వీట్స్ షాప్ వద్ద మహాత్మ గాంధీ విగ్రహం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. బైక్ ర్యాలీని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు జెండా ఊపి ప్రారంభించగా జిల్లా కలెక్టర్ నాగరాణి బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, కోడలిగా ఇన్ని పాత్రలు పోషిస్తున్న మహిళ కు సమాజంలో గౌరవం ఇవ్వాలని, ఆడపిల్లలు సురక్షితమైన వాతావరణంలో ప్రశాంతంగా జీవించడానికి ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలని అన్నారు. ప్రతి సంవత్సరం 2 శాతం ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగు పరచాలని అన్నారు. జిల్లాలో జనవరి 22 నుండి మార్చి 8 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానమని, వారిని గౌరవించిన చోట సుభిక్షంగా ఉంటుందని అన్నారు.ఆడపిల్లలు అన్ని రంగాలలోనూ ముందుకు నడిచేలా భీమవరం నియోజకవర్గం నుండి పూర్తి సహకారాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి సుజాత రాణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ, వైద్యశాఖ డిపిఎంఓ ధనలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసి రెడ్డి, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.
