సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో వచ్చే ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి తిరు కల్యాణోత్సవం, రథోత్సవం, స్వామివారి చక్రస్నానం, హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాలకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా పారిశుధ్యం, తాగునీరు, టాయిలెట్లు, పార్కింగ్, రవాణా, భక్తుల దర్శనం తదితర ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. మెరైన్, సివిల్ పోలీసులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు కల్యాణోత్సవాల్లో దుకాణాల్లో కల్తీ పదార్థాలు విక్రయించకుండా ఫుడ్ క్వాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతీరోజు ఉత్సవ ఈవెంట్లు నిర్వహించిన తీరు వివరాలను ఆర్డీవో కె.మాధవి అదేరోజు సాయంత్రం మీడియాకు వివరిస్తారన్నారు.
