సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భారతీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు కాస్త లాభాల బాటనే పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు వచ్చే శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మాత్రం ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. చివరకు మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే రోజును ముగించాయి. గత బుధవారం ముగింపు (76, 532)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 65 పాయింట్ల స్వల్ప లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం సమయంలో 400 పాయింట్లకు పైగా లాభపడి 76,962 వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో నష్టాల్లోకి జారుకుంది. చివరకు సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 76, 759 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 86 పాయింట్ల లాభంతో 23, 249 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.63గా ఉంది.
