సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి నుండి భీమవరంలో ఇద్దరు ఎంపీలు ఉండటం అది కూడా బీజేపీ పార్టీకి చెందిన వారు కావడం ఒక అరుదయిన ఘటన చోటు చేసుకొంది. రాజ్యసభ సభ్యుడిగా భీమవరం పట్టణానికి చెందిన బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ నేడు, బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ( ఫై తాజా చిత్రంలో )ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. పాకా సత్యనారాయణ ను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాకా కు రాజ్యసభ సభ్యునిగా చేయడం ద్వారా బిజెపిలో క్రమశిక్షణతో పని చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని మరొకసారి రుజువైందని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి సత్య కుమార్ యాదవ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈకార్యక్రమంలో, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు బిజెపి నాయకులు, పాకా కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
