సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల కాలంగా సరైన విజయాలు లేక వెనుకబడ్డ యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ ముగ్గురు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా భైరవం. తమిళంలో విజయం సాధించిన గరుడన్ చిత్రానికి ఇది రీమేక్. ఈచిత్రంలో ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది నాయికలు. జయసుధ, సంపత్ రాజ్, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ‘నాంది’, ‘ఉగ్రం’ సినిమాల తర్వాత విజయ్ కనకమేడల దర్శకత్వం వహించి సినిమా ఇది. నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భైరవం సినిమా కధ విషయానికి వస్తే.. శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) అనాధ, వరద(నారా రోహిత్) లారీ ట్రాన్స్పోర్ట్ అధిపతి, గజపతి వర్మ (మంచు మనోజ్) ఒకప్పుడు బాగా బ్రతికి చితికిన జమీందారు. ఈ ముగ్గురు మంచి స్నేహితులుగా దేవీపురంలో నివశిస్తుంటారు. ఆ గ్రామ దేవత వారాహీ అమ్మవారి గుడికి గజపతి వర్మ (మంచు మనోజ్) నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ధర్మకర్త. ఆ దేవాలయానికి చెందిన భూములను కబ్జా చెయ్యడానికి దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) రంగంలోకి దిగుతాడు. దానికి అడ్డుగా ఉన్న నాగరత్నమ్మ ను చంపిస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో దేవాలయ ధర్మకర్తగా శీను నియమిత మవుతాడు. గుడికి చెందిన 75 ఎకరాల భూమి దక్కించుకోవాలంటే వరద, గజపతి, వారికి నమ్మిన బంటుగా ఉన్న శ్రీనుని దాటుకుని వెళ్లాలి. అది అసలు ట్విస్ట్.. వరద, గజపతి మధ్య ఈ భూమి,కోసం ఎలాంటి పోరాటం జరిగింది అన్నది వెండి తెరపై చూడవలసిందే.. ఇక సినిమా ఎలా ఉందంటే.. మొదట కాస్త నెమ్మదిగా సాగినా వరదా, గజపతిల మధ్య స్నేహం గొడవకు దారితీసిన వైనం, మధ్యలో శ్రీను పడ్డ యాతన..ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, దర్శకుడు మంచి పీల్ తో తీసాడు. ద్వితీయార్థంలో గజపతి స్వార్థం బయటపడటం, వరదతో గొడవ.. ఈ నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ బాగానే తీశారు. ముగ్గురు హీరోలకు సమాన ప్రాధాన్యత తో పాటు వారి నెగిటివ్ షేడ్స్ కలపి తీసినప్పటికి ప్రేక్షకుడు కధలో లీనమయ్యే ఎమోషన్స్ బలంగా లేవు. బెల్లంకొండ శ్రీను ఇంతకు ముందు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంది. నారా రోహిత్ చాల క్లాస్ గా నటించాడు. గజపతి పాత్రలో మంచి కసితో ఉన్న మంచు మనోజ్, డైలాగ్ డెలివరీ, మేనరిజం అన్నీ తండ్రి మోహన్ బాబును గుర్తుకు తెచ్చాడు. శ్రీను వెన్నెల (అదితి శంకర్) మధ్య లవ్ కెమిస్ట్రీ సెట్ కాలేదు. అయితే పాటలు వాటి చిత్రీకరణ బాగుంది. వెన్నెల కిశోర్ పాత్ర అంతగా నవ్వులు పండించలేదు. థ్రిల్లర్ చిత్రాలకు సంగీతం అందిస్తూ వచ్చిన శ్రీచరణ్ పాకాల పక్కా మాస్ మసాలా సంగీతం, బిజియం అందించాడు. సినిమాటోగ్రఫీ బావుంది. కె.కె.రాధామోహన్ నిర్మాణ విలువలు బావున్నాయి. అద్భుతం కాదు కానీ పర్వాలేదు బైరవమ్..
