సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా లోక్‌సభలో.. తెలంగాణాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు. సభ్యులు మాట్లాడుతుంటే నినాదాలు చేయడం సరికాదని, సభ ప్రజల గొంతు వినిపించడం కోసం ఉందని సూచించారు. సభలో గందరగోళం కొనసాగడంతో మధ్యాహ్నం గం. 12.00 వరకు స్పీకర్ వాయిదా వేశారు. అలాగే రాజ్యసభలో కూడా మొదటి రోజు నుంచి రాజ్యసభలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సభ వెల్‌లోకి విపక్ష ఎంపీలు వెళ్లడంతో సభ గందరగోళంగా మారింది. 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే అంశం సభను రసాభసగా మార్చింది. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ టిఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు కూడా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీనితో రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
