సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయడానికి అధికార వర్గాలు చర్యలు ప్రారంభించాయి. ఇదే సమయంలో ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలంటే కోర్టుల డైరెక్షన్, చట్టపరమైన పరిమితులను అధిగమించాల్సి ఉంది. మరోవైపు వచ్చే మార్చితో వైసీపీ ప్రభుత్వంలో నియమించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుండడంతో ఈలోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ఆమె పదవీ విరమణ తరువాత ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా స్థానిక ఎన్నికల కోసం పోటీచేసే నేతలను శ్రేణులను సిద్ధం చేసుకొనే పనిలో ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 24 శాతం కోటాను 34 శాతం చేయడానికి జనాభా గణాంకాలు, ప్రతీ నియోజకవర్గంలో కులాల విభజన, సామాజిక వెనుకబాటుతనం వంటి వివరాలు అవసరం అవుతాయి. ప్రభుత్వ ఆమోదంతో పాటు కోర్టుల ఆమోదం లభిస్తేనే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది.ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం వచ్చే సెప్టెంబర్ చివరతో ముగుస్తుంది. జనవరిలో రిజర్వేషన్స్ విభజనపై కమిషన్ ఏర్పాటైతే కనీసం మూడు నుంచి ఆరు నెలల కాలంలో నివేదిక రావచ్చు. ఆ నివేదిక వచ్చిన వెంటనే ఆమోదం పొంది రిజర్వేషన్ల శాతం ఖరారైతే సెప్టెంబర్ – అక్టోబర్‌లో పరిషత్ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది.
